అమరావతి, 31 ఆగస్టు (హి.స.)
ఉంగుటూరు, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు సర్పంచి రాంధే లక్ష్మీ సునీత మరోసారి జాతీయ స్థాయిలో మెరిశారు. ‘సర్పంచ్ సంవాద్’లో భాగంగా ఆగస్టుకు సంబంధించి ‘స్వచ్ఛమైన గ్రామం- స్వచ్ఛమైన నీటి వనరుల గ్రామం (స్వచ్ఛ్ గావ్ సుజల్ గావ్)పై ప్రజా భాగస్వామ్యంతో ప్రతిజ్ఞ’ థీమ్‌పై కేంద్ర ప్రభుత్వం పోటీలు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా వందలాది మంది సర్పంచులు ఆన్‌లైన్‌లో వీడియోలు పంపారు. అందులో పది ఉత్తమ వీడియోలు ఎంపిక చేయగా.. అందులో లక్ష్మీ సునీతకు స్థానం దక్కింది.
ప్రతిష్ఠాత్మకంగా చేయించి.. చేబ్రోలులో ఈ నెల 6న ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, డీపీవో అనురాధ, ప్రజలతో కలిసి లక్ష్మీ సునీత ప్రతిజ్ఞ చేయించారు. ఈ వీడియోను ‘సర్పంచ్ సంవాద్’ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందుకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. టాప్-10లో చోటు కల్పించింది. జూన్‌లో స్వచ్ఛత, తాగునీటిపై నిర్వహించిన పోటీల్లో లక్ష్మీ సునీత జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విషయం విదితమే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ