హైదరాబాద్, 31 ఆగస్టు (హి.స.)
ఖైరతాబాద్ మహా గణపతిని
దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో నగరం నలుమూలల నుంచి భక్తులు ఖైరతాబాద్ కు క్యూ కట్టారు. ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రోల్లోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలైన్ ఉండగా.. ఆన్లైన్ టికెట్లు కూడా బుక్ అవ్వక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు మూడు క్యూలైన్లలో వెళ్తున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. కాగా.. ఈ నెల 7న చంద్రగ్రహణం ఉండటంతో 6వ తేదీనే మహాగణపతిని నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు