అమరావతి, 31 ఆగస్టు (హి.స.)కొత్త మద్యం పాలసీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఘోరంగా విఫలమైంది. గతంలో షాపులకు గానీ, బార్లకు గానీ పాలసీ ప్రకటిస్తే వ్యాపారులు ఎగబడేవారు. అలాంటిది తొలిసారి ఈ వ్యాపారం వద్దంటూ వెనకడుగు వేయడం విస్తుగొల్పుతోంది. సగానికిపైగా బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. చివరకు మిగతావాటికే శనివారం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేశారు. ఓపెన్ కేటగిరీలో 840, కల్లుగీత కులాలకు 84 బార్లకు (మొత్తం 924) ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. ఓపెన్ కేటగిరీ బార్లు 388, గీత కులాల బార్లు 78 శనివారం లాటరీలోకి వచ్చాయి. ఇంకా 458 బార్లు దరఖాస్తులు రాక మిగిలిపోయాయి. వీటిలో 37 బార్లకు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు అందాయి. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉండడంతో వాటికి లాటరీ నిర్వహించలేదు.
ఈ 37 బార్లకు దరఖాస్తులు సమర్పించే గడువును సోమవారం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. 2న లాటరీ తీస్తారు. అసలు దరఖాస్తులు రాని 421 బార్లకు త్వరలో రీనోటిఫికేషన్ జారీచేస్తామని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కోనసీమ జిల్లాలో ఒక్క బార్‌కు మాత్రమే లాటరీ తీశారు. విశాఖ, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో కొంత మెరు గు. మరీ ఆశ్చర్యంగా గీత కులాల బార్లలోనూ 6 మిగిలిపోయాయి. గీత కులాలకు రాష్ట్రవ్యాప్తంగా 84బార్లు కేటాయించారు. వాటికి లైసెన్స్ ఫీజు 50 శాతమే. తీరా చూస్తే ఆరు బార్లకు 4 దరఖాస్తులు రాక లాటరీనే నిర్వహించలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ