దిల్లీ:4 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని (China Land grab claim) రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేతను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది. రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వాదించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులో మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని పేర్కొంది. ఇటువంటి సమస్యలను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ