అమరావతి, 4 ఆగస్టు (హి.స.)ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇంకా బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తూర్పు అరేబియా సముద్రం వరకు ఉపరితలద్రోణి విస్తరించింది. మరోవైపు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. కాగా, పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఒంగోలులో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయిని, ఈ నెల ఐదో తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు పల్నాడు జిల్లాతోపాటు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మన్యం, అల్లూరి, ఏలూరు గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి