న్యూఢిల్లీ, 5 ఆగస్టు (హి.స.)
మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వేదికగా స్పందించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను.. పదవులపై సీఎం రేవంత్ రెడ్డి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిన విషయం నాకు తెలియదని స్పష్టం చేశారు. ప్రస్తుత కేబినెట్లో నేను సీనియర్ మంత్రిని అయినా.. హైకమాండ్ నిర్ణయమే కీలకం అని వెంకట్ రెడ్డి అన్నారు. నేనే కాదు.. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేరు అని చెప్పారు.
కాగా నేడు నల్గొండలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 'మంత్రి పదవి ఇస్తారా ఇవ్వారా.. అది మీ ఇష్టం.. నేను మాత్రం దిగజారి బతకలేను. పార్టీలు మారిన వాళ్లకు పదవులు, నాలాంటి సీనియర్లకు అవమానమా అని మండిపడ్డారు. ఎవరి కాళ్లు పట్టుకుని మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. మనసు దిగజార్చుకుని బతకడం ఇక నావల్ల కాదంటూ రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..