అమరావతి, 5 ఆగస్టు (హి.స.)
బేస్తవారపేట, : బదిలీపై వచ్చిన అధికారిణిని విధుల్లోకి అనుమతించకపోవడంతో... గత 11 రోజులుగా ఆమె కార్యాలయానికి వస్తున్నా ఆరుబయటే నిరీక్షించాల్సి వస్తోంది. బేస్తవారపేట ఉపాధి హామీ కార్యాలయంలో ఈ చోద్యం చోటుచేసుకుంటోంది. వివరాలు ఇలా ఉన్నాయి. తర్లుపాడు ఉపాధి హామీ కార్యాలయంలో జూనియర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న సుభద్రాదేవి... ఇటీవల దర్శికి బదిలీ అయ్యారు. మార్కాపురంలో ఉండే తనకు ఆ ప్రాంతం దూరమవుతుందని... బేస్తవారపేటలో ఖాళీ ఉన్నందున అక్కడకు పంపాలని అధికారులకు విన్నవించారు. డ్వామా పీడీ ఆ వినతిని పరిగణనలోకి తీసుకుని... అక్కడకు బదిలీ చేస్తూ గత నెల 24న ఆదేశాలు జారీ చేశారు. 25న ఎంపీడీవో రంగనాయకులుకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి విధుల్లో చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఆ తరువాత నుంచి విధులు నిర్వహించేందుకు అనుమతించడం లేదు. దీంతో ఆమె కార్యాలయానికి వస్తున్నా ఆరుబయటే నిరీక్షించాల్సి వస్తోంది. విషయం పీడీ దృష్టికి వెళ్లడంతో... ఆయన అక్కడి సిబ్బందిని హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ వారు బేఖాతరు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ జోక్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ