తెలంగాణ, నల్గొండ. 5 ఆగస్టు (హి.స.) మిషన్ కాకతీయ పేరుతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు దోచుకున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మునుగోడు మండల పరిధిలోని సోలిపురం గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ గ్రామ సమస్యలు తెలుసుకుంటూ కబ్జాకు గురైన చెరువును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పైపైనే పనులు చేసి వేలకోట్ల రూపాయలు దండుకున్నారని, గ్రౌండ్ లెవెల్ లో మిషన్ కాకతీయ పనులు సక్సెస్ కాలేదన్నారు. నీరు సకల కోటి ప్రాణాలకు జీవనాధారమని, వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భజలాలు పెంచుకోవడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసుకోవలసి ఉందన్నారు. చెరువులు నిండుగా ఉండటం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. కబ్జాకు గురైన చెరువు భూములను సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు