తెలంగాణ, నల్గొండ. 5 ఆగస్టు (హి.స.)
ఏఎంఆర్పీ కాల్వల ద్వారా ఎట్టి
పరిస్థితుల్లో చెరువులు నింపడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆ కాల్వలకు సాగు నీరందించే నాలుగు మోటర్లకు గాను ఒక మోటారు రిపేర్లో ఉండటం, మరో మోటారు ట్రిప్ అవుతుండడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రావడం లేదని తెలిపారు.ఈ విషయమై మంగళవారం ఆమె తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏఎంఆర్పీ కాల్వల ద్వారా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారబంది పద్ధతిలో సాగునీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు గాను తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ఉదయ సముద్రం నుండి 100 క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తున్నదన్నారు. మోటారు మరమ్మతుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున, సాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉదయ సముద్రం నుండి 50 క్యూసెక్కుల నీటిని కుషన్ పెంచి విడుదల చేయడం జరుగుతుందని, అదనంగా ఒకరోజు ఇలాగే కొనసాగించాలని చెప్పారు. ప్రస్తుతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు