తెలంగాణ, పెద్దపల్లి. 5 ఆగస్టు (హి.స.)
పెద్దపల్లి జిల్లా బిజెపిలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే కమలం శ్రేణులు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు పెద్దపల్లిలో జరుగు ముఖ్య కార్యకర్త సమావేశానికి వస్తున్న సందర్భంగా మంగళవారం బిజెపి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై పెద్దపల్లి కమాన్ వద్ద గజమాలతో స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్సెస్ దుగ్యాల ప్రదీప్ కుమార్ రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రచార వాహనం దిగిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పరస్పరం దాడులు చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా బిజెపి పార్టీలో కొద్దిరోజులుగా వర్గ పోరు సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఎదుటే మరో మారు రెండు వర్గాల మధ్య వర్గ పోరు జరిగి నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. అక్కడే ఉన్న సీఐ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలను వారించి రెండు వర్గాలను శాంతింపజేశారు. బిజెపి తన్నులాట పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది.
రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే గ్రూప్ తగాదాలు తలెత్తడంతో కొంత అవమానానికి గురైనట్లు కనబడింది. స్వాగతం తెలిపే క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున మనస్పర్ధలు వచ్చి తన్నుకునే స్థాయికి చేరడం బిజెపి శ్రేణుల్లో కొంత నిరాశను నింపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు