విశాఖపట్నం 6 ఆగస్టు (హి.స.):పండుగ వాతావరణంలో ఈనెల 25వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ డిపోలు నిర్ణీత సమయాలలో తెరిచి ఉంచాలని, సరుకుల వివరాలు తెలిపే బోర్డులు ఉండాలన్నారు. క్యూఆర్ కోడ్‌తో ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా డీలర్లు వసూలు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డిపోల వద్ద డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలన్నారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాఽధికారులతో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల మన్ననలు పొందేలా సేవలు అందించాలని, వారి సంతృప్తే కొలమానంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. గ్యాస్ సబ్సిడీపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. రైతుల ప్రయోజనం కోసం గత సీజన్‌లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రూ.12 వేల కోట్లు చెల్లించామన్నారు. స్థానికంగా పండే ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకంలో వినియోగించేందుకు ప్రతిపాదనలు పంపాలని శ్రీకాకుళం, విజయనగరం జేసీలను ఆదేశించారు. వలసదారులకు రేషన్ సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ తూనికలు, కొలతలు, ఆహార భద్రతా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ