అమరావతి, 6 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. మహిళలకు ఉచిత ప్రయాణం, నూతన బార్ లైసెన్స్ పాలసీ సహా మొత్తం పది కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా ఐదు కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్త్రీ శక్తి పేరుతో తీసుకువస్తున్న ఈ పథకంపై మంత్రిమండలిలో చర్చ జరుగుతోంది. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పర్యాటక శాఖ పరిధిలోని 22 హోటళ్లు, రిసార్టులు, క్లస్టర్ల నిర్వహణ కోసం ఏజెన్సీ ఎంపిక నిర్ణయాధికారాన్ని ఆ శాఖ ఎండీకి కల్పించడంపై ఈ భేటీలో చర్చించనున్నారు. నూతన బార్ లైసెన్స్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు ఆమోదం, లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూముల అనుమతి, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మీడియా అక్రిడిటేషన్ల కొత్త నిబంధనలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి