కర్నూలు, 6 ఆగస్టు (హి.స.)ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) శ్రీశైలం జలాశయానికి గత కొన్ని రోజులుగా కొనసాగిన వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 64,562 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,01,131 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,816 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం(Srisailam Project) పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.40 టీఎంసీలుగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి