రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. నిమిషానికి లక్ష టికెట్లు.. బుకింగ్ కష్టాలకు చెక్
ఢిల్లీ, 9 ఆగస్టు (హి.స.)భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులకు, వేగం లేమికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగల ప్యాసి
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. నిమిషానికి లక్ష టికెట్లు.. బుకింగ్ కష్టాలకు చెక్


ఢిల్లీ, 9 ఆగస్టు (హి.స.)భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులకు, వేగం లేమికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) సామర్థ్యాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచనుంది. ఆధునికీకరించిన వ్యవస్థ ద్వారా నిమిషానికి లక్షకు పైగా టికెట్లను సులభంగా జారీ చేసేలా భారీ మార్పులు చేపడుతోంది.

సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్‌) ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. 2010 నుంచి వాడుకలో ఉన్న పాత టెక్నాలజీ సర్వర్లు, సాఫ్ట్‌వేర్‌ల స్థానంలో అత్యాధునిక క్లౌడ్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ అప్‌గ్రేడ్ ద్వారా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్, భద్రతాపరమైన అంశాలను పూర్తిగా ఆధునికీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మార్పులు అవసరమని మంత్రి వివరించారు.

ఈ సాంకేతిక మార్పులతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్‌పీ)ను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. టికెట్ బుకింగ్ ట్రెండ్‌ను పరిశీలించడం, ఊహించని కారణాల వల్ల ప్రయాణాలు రద్దు చేసుకునే వారి సంఖ్యను తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ప్రయాణికులకు టికెటింగ్ సేవలను మరింత సులభతరం చేసేందుకు 'రైల్ వన్' అనే కొత్త మొబైల్ యాప్‌ను కూడా రైల్వే శాఖ ఇటీవలే ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను నేరుగా ప్రయాణికులే తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి బుక్ చేసుకోవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande