హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు. సోమవారం రాజ్ భవన్ వెళ్లిన అఖిలపక్ష నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్, సీపీఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉన్నారు.
పంచాయతీ రాజ్ చట్టం -2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరారు. తెలంగాణలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆగస్టు 31 న శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, ఈ మేరకు మూడ్ ఆఫ్ హౌజ్ను పరిగణనలోకి తీసుకోవాలని అఖిల పక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా బీసీ జనాభా వివరాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.
సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. 50 శాతం రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశామని తెలిపారు. కుల గణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలో 56.33 శాతం బీసీల జనాభా ఉందన్నారు. బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు