తిరుమల, 1 సెప్టెంబర్ (హి.స.)
ఈ నెలలో రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సెప్టెంబర్ 7, 2025న చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుందని TTD ప్రకటించింది. ఆలయ పరిపాలన ప్రకారం సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీవారి ఆలయం ముసివేయనున్నారు. చంద్ర గ్రహణం వీడి ఆలయాన్ని సంప్రదాయం ప్రకారం శుద్ధి కర్మలను చేసిన తర్వాత సెప్టెంబర్ 8, 2025న తెల్లవారుజామున 3:00 గంటలకు తిరిగి తెరవనున్నట్లు ప్రకటించారు.
సాంప్రదాయ ఆచారాల ప్రకారం మూసివేత
హిందూ సంప్రదాయాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణ సమయం పూజలు నిర్వహించడానికి అశుభకరమైనదిగా భావిస్తారు. భారతదేశంలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒకటైన తిరుమల తిరుపతి ఆలయం ఈ ఆచారాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. ఈ కాలంలో ఆలయంలో శ్రీవారి దర్శనం, అన్ని రకాల సేవలు నిలిపివేయబడతాయి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత… ఆలయ పూజారులు పుణ్యహవచనం (శుభ్రపరిచే ఆచారాలు), ఇతర వేద ఆచారాలను నిర్వహించి భక్తుల కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. గ్రహణం తర్వాత శుద్ధి కర్మలు పూర్తయిన వెంటనే ఆలయంలో అన్ని సాధారణ సేవలు, దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి