పట్నా/న్యూఢిల్లీ, 01 సెప్టెంబర్ (హి.స.) : ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తర్వాత బిహార్‌లోని ఓటర్లందరికీ కొత్త ఓటర్ కార్డులివ్వాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఆగస్టు 1 నాటికి బిహార్‌లో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అభ్యంతరాలకు ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1 వరకు ఈసీ గడువు ఇచ్చింది. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.11 శాతం మంది ఇప్పటికే తమ ధృవీకరణ పత్రాలు సమర్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు పొరపాటున వచ్చాయని, జాబితా నుంచి తొలగించాలని మొత్తం 2 లక్షల మంది కోరారు. అదే సమయంలో 33 వేల మంది తమ పేర్లను ఓటర్ జాబితాలో కలపాలని కోరారు. సెప్టెంబరు 30న ఈసీ తుది జాబితా ప్రకటించనుంది. కాగా, బిహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సోమవారంతో ముగియనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ