నిజామాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
అవసరానికి మించి ఎత్తుగా నిర్మించిన చెక్ డ్యాముల నిర్మాణమే కొంప ముంచిందని, వరదలకు కారణమైందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా భీంగల్ మండలంలో నష్టపోయిన పంటలను, ధ్వంసమైన రోడ్లను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన వాళ్లకు ప్రయోజనం కలిగించేలా తీసుకున్న నిర్ణయాలే వరద ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వాగులపై చెక్ డ్యామ్ ల నిర్మాణం విషయంలో ప్రశాంత్ రెడ్డి చేసిన పొరపాట్లే ఈ వరద కష్టాలకు కారణమని ఎంపీ ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో చెక్ డ్యాముల హైట్ ను అవసరానికి మించి డిజైన్ చేయించి, ఎస్టిమేషన్ ను పెంచి నిర్మించడం కారణంగానే భారీ వర్షాలకు కట్టలు తెగిపోయాయని, వరద ముప్పు ఏర్పడి ఇంత పెద్ద నష్టం వాటిల్లిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు