రాజంపేట1 సెప్టెంబర్ (హి.స.)
:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబరు ఒకటో తేదీన 63,61,380 మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.2746.52 కోట్ల నిధులు గ్రామ, వార్డ్ సచివాలయాలకు విడుదల చేసింది. ఈ మేరకు సచివాలయ సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు.
అలాగే, పేదల సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్నారు. మండలంలోని బోయనపల్లెలో స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం దోబీఘాట్‌లో రజకులతో మాటాడి వారికి పలు పథకాలు అందజేయనున్నారు. తర్వాత తాళ్లపల్లెలో ప్రజావేదిక సమావేశంలో సీఎం ప్రసంగిస్తారు. అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లతోనూ, ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతోనూ సమావేశమవుతారు. తిరిగి సాయంత్రం ఉండవల్లిలో ఉన్న ఇంటికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. కాగా, రెగ్యులర్ పింఛన్లతోపాటు, కొత్తగా మంజూరైన 7872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారులకు కోసం రూ.3.15 కోట్లు అదనంగా విడుదల చేశామని సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ కోసం రూ.32,143 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 2025 వరకు రూ.16366.80 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ.10 వేల కోట్లకు మించి కేటాయించలేదని తెలియజేశారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా, లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడంతోపాటు, వారి జియో-కోఆర్డినేట్స్‌ను కూడా నమోదు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ