హైదరాబాద్, 1 సెప్టెంబర్ (హి.స.)
'కాళేశ్వరం'పై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న
కుట్రలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు రెండు రెండో రోజుల పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో ఇవాళ ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల, జిల్లా కేంద్రాల్లో నేడు రేపు వివిధ రూపాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పిలుపు మేరకు ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు అంటూ వివిధ రూపాల్లో నిరసనలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం పైన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను సమర్థంగా తిప్పి కొట్టాలని అన్నారు. ఇది కేసీఆర్పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను ఒక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగమేనని పేర్కొన్నారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనని అన్నారు. నిన్నటి దాకా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని.. దాని వెనక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విచారణకు సీబీఐకి ఇచ్చినా.. లేక ఇతర ఏ ఏజెన్సీకి ఇచ్చిన భయపడేది లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు