ముంబై, 1 సెప్టెంబర్ (హి.స.) వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) మరోసారి తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 51.50 మేర కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,580కి చేరింది.
నెలవారీ సమీక్షలో భాగంగా చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరల తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు పెద్ద ఊరట కలిగించనుంది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. జులై 1న రూ. 58.50, ఆగస్టులో రూ. 33.50 చొప్పున ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు జూన్‌లో కూడా సిలిండర్‌పై రూ. 24 తగ్గించారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇతర మార్కెట్ అంశాల ఆధారంగా ప్రతి నెలా ఈ ధరలను సవరిస్తుంటారు.
అయితే, 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు నిరాశే ఎదురైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి