శ్రీశైలం , 1 సెప్టెంబర్ (హి.స.) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద పోటెత్తడంతో శ్రీశైలం నీటి మట్టం పెరుగుతోంది.
దీంతో శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అధికారులు పది గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి దిగువనున్న నాగార్జునసాగర్‌కు 3,65,282 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,237 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 882.60 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.50 టీఎంసీలుగా నమోదై ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి