తిరుమల, 1 సెప్టెంబర్ (హి.స.)అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు, తిరుమల గిరులన్నీ బ్రహ్మోత్సవాల శోభ కనిపించేలా టీటీడీ (TTD) శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) జరగనుండగా.. 23వ తేదీ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకూ స్వామివారికి వాహనసేవలు నిర్వహిస్తారు. ఈ వాహన సేవల వివరాలను టీటీడీ వెల్లడించింది.
సెప్టెంబర్ 24 - సాయంత్రం 5.43 గంటల నుంచి 6.15 గంటల సమయంలో మీనలగ్నంలో ధ్వజారోహణం. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనసేవ.
సెప్టెంబర్ 25 - ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనసేవ, మధ్యాహ్నం 1-3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ.
సెప్టెంబర్ 26 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ. సెప్టెంబర్ 27 - ఉదయం 8 గంటలకు కల్పవృక్షవాహన సేవ, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనసేవ.
సెప్టెంబర్ 28 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుంచి గరుడ వాహనసేవ. సెప్టెంబర్ 29 - ఉదయం 8 గంటలకు హనుమంత వాహనసేవ, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహనసేవ. సెప్టెంబర్ 30 - ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనసేవ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనసేవ.
అక్టోబర్ 1 - ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి అశ్వవాహన సేవ. అక్టోబర్ 2 - ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ చక్రస్నానం. రాత్రి 8.30 -10 గంటల వరకూ ధ్వజారోహణం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి