నల్గొండ, 10 సెప్టెంబర్ (హి.స.) యూరియా కోసం పడి కాపులు కాసిన రైతన్నలు రోడ్డుపై ధర్నా చేసిన సంఘటన నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
బుధవారం ఉదయం నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా యూరియా కోసం వేచి చూసి సహనం కోల్పోయిన రైతులు.. ఒక్కసారిగా వందల సంఖ్యలో వచ్చి నేడు భారీ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నాటు వేసిన 20 రోజులకు యూరియా చల్లాల్సి ఉండగా సుమారు 50 రోజులు దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి యూరియా చల్లకపోవడం వలన పంట చేతికి వస్తుందా రాదా అనే నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి పెట్టుబడుల కోసం అప్పు తెచ్చి మరీ నాటు వేసాము అని తెలిపారు. ఇక ఈ ధర్నా వల్ల సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు