పెద్దపల్లి, 11 సెప్టెంబర్ (హి.స.)
మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభవ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం మంథనిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్కు శంఖుస్థాపన చేశారు. అదే విధంగా స్థానిక ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ మంచు లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను సైతం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య అందాలని స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మంథని నియోజకవర్గ పరిధిలో ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..