అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీల(Medical Colleges)పై వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైద్య విద్య(Medical education)ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పీపీపీ విధానంలో ఈ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ విధానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. తమ హయాంలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెబుతోంది. ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని విమర్శలు చేస్తున్నారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.
తాజాగా మంత్రి పార్థసారథి స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విమర్శలు కురిపించారు. మెడికల్ కాలేజీలపై వైసీపీది దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో 17 కాలేజీలు ప్రారంభించి ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 10 శాతం నిధులు పెట్టి తామే చేసినట్టు చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు.
అనంతపురంలో కూటమి సభ విజయవంతం కావడంతో జగన్, వైసీపీ నేతలు ఓర్వలేకనే తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. కనీసం చంద్రబాబు వయసుకైనా జగన్ గౌరవం ఇవ్వాలని సూచించారు. దమ్ముంటే పెన్షన్లపై జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పెన్షన్లపై కావాలనే YCP నేతలు బురదజల్లుతున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి