రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు'.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి.13 సెప్టెంబర్ (హి.స.) ''ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని'', రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఘట్కేసర్ మండల రెవెన్యూ కార్యాలయం ఎ
ఎంపీ ఈటెల రాజేందర్


తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి.13 సెప్టెంబర్ (హి.స.)

'ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన

రాజ్యం బాగుపడదని', రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తానని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. ఘట్కేసర్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి శనివారం ఈటెల రాజేందర్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ కోసం రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రైతులు దీక్షలు చేయకుండా పోలీసులతో మైకులు తీయించడం, టెంట్లు కూల్చివేయడం సరైన పద్దతి కాదన్నారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలని నాయకులకు బానిసల్లా ఉండొద్దని హితవు పలికారు.

పత్రికలు, టీవీ ఛానళ్లు రైతు సమస్యలను చూపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు చేరేలా చేసి రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్, ఘట్కేసర్, మూడుచింతలపల్లి రైతులకు ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 24/7 రైతులకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రైతులు చేసే ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తే రాబోయే కాలంలో రైతులు కర్రు కాల్చి వాతలు పెడతారని అన్నారు. రైతు రుణమాఫీ నిధులు దాదాపు రూ.9 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande