హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థుల సమస్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు యువతను నిలువునా మోసం చేశాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక ప్రైవేటు కళాశాలలు మూతపడే దుస్థితి వచ్చాయని బండి సంజయ్ అన్నారు.
తమ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లను కళాశాలల తీసుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక యాజమాన్యాలు, సిబ్బంది జీతాలు లేక ఆవస్థలు పడుతున్నారని.. తాము నమ్ముకున్న సంస్థలు కళ్లెదుటే కూలిపోతున్నాయని అన్నారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ పాలనా వైఫల్యమేనని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కనీసం గ్రూప్-1 పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారని మండిపడ్డారు
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు