హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విబేధాలు మళ్లీ ముదురుదుతున్నాయి. భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ విషయంలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య చిచ్చురేగింది. తన నియోజకవర్గంలోని ఆలయంలో తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలను నియమించడంపై ఎమ్మెల్యే మండిపడుతున్నారు. కొండ సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే నష్టం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు.
స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని అని ప్రశ్నించారు. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంభిస్తే తాను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది దేనికని, తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..