అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నేతలు మరోసారి కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో రాజధానిపై 'మూడు ముక్కలాట' ఆడిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని ఆయన గుర్తుచేశారు. అయినా వైకాపా నేతలు తమ వైఖరి మార్చుకోకుండా ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒకవైపు అమరావతి రాజధానిగా వద్దని చెబుతూనే, మరోవైపు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తామని వైసీపీ నేతలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని అనగాని దుయ్యబట్టారు. ఈ అంశంలో జగన్ వైఖరి ‘గోడ మీద పిల్లి’ చందంగా ఉందని, ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గత ఐదేళ్ల పాలనలో అమరావతి రైతులు, మహిళలపై జగన్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, వారిని పెట్టిన ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని మంత్రి అన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించిన తీరును ఎవరూ క్షమించరని తెలిపారు. అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాభివృద్ధిని కుంటుపరిచిన జగన్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు ఓటమి తప్పదని అనగాని సత్యప్రసాద్ జోస్యం చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి