అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)వాయవ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం (Low Pressure), దానికి అనుబంధంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఏపీలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు.. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు చెట్లు, హోర్డింగుల వద్ద నిలబడవద్దని హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణలో నాలుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ నుంచి అతిభారీ వర్షసూచన చేసింది. నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ (UAC) కారణంగా తెలంగాణ నార్త్, వెస్ట్, సెంట్రల్ జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి - భువనగిరి జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులు వస్తాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకూ వాతావరణం పొడిగా ఉంటుందని, మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి