అమరావతి, 13 సెప్టెంబర్ (హి.స.)ఏపీ(Andhra Pradesh)లో రాజధాని కోసం వైసీపీ(YCP), టీడీపీ(TDP) విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో చేసిన రాజకీయం ఘోరమైన ఓటమిని తెచ్చిపెట్టడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. రాజధాని రగడ పై సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ తరుణంలో వైసీపీ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాం అని.. అమరావతి నుంచే వైఎస్ జగన్ పరిపాలన చేస్తారని సంచలన ప్రకటన చేశారు.
ఈ క్రమంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి ఉంటే మాత్రం విశాఖపట్నం నుంచే పరిపాలన కొనసాగించేవారని వివరించారు. అమరావతిలో ఇప్పుడున్న సెక్రటేరియట్ సరిపోతుందని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త భవనాలు కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి