హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం అర్థరాత్రి నుంచి 'ఆరోగ్యశ్రీ' సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం (TANHA) ప్రకటించింది. సమస్యల పరిష్కారంపై సమీక్షలు జరిపినా.. ప్రభుత్వం పదేపదే ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు
టీఏఎన్హెచ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వడ్డిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 20 రోజులుగా ఆరోగ్యశాఖ మంత్రి, ఏహెచ్సీటీ సీఈఓతో తాము తరచూ సమావేశాలు నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ బకాయిల సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిష్కారం
లేకపోవడం వల్ల ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం (సెప్టెంబర్ 16) రాత్రి
11:59 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.ప్రజలు, లబ్ధిదారులు తమ సమస్యను అర్థం చేసుకొని మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..