పనితీరు బాగుంటేనే కొనసాగింపు.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్
అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)“కార్యాలయాల్లో కూర్చుని కాగితాలు చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయి. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలి,” అని ముఖ్యమం
చంద్రబాబు


అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)“కార్యాలయాల్లో కూర్చుని కాగితాలు చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయి. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలి,” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. సచివాలయంలోని ఐదో బ్లాకులో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు తొలి రోజు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా నియమితులైన కలెక్టర్లకు రాష్ట్ర ప్రజలు, మంత్రివర్గం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ పాలనలో ప్రధాని, ముఖ్యమంత్రి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని చంద్రబాబు అభివర్ణించారు. “ఒక జిల్లా రూపురేఖలను మార్చే ప్రధాన బాధ్యత కలెక్టర్లదే. ప్రభుత్వం రూపొందించిన విధానాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాల్సింది మీరే. అందుకే సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతోనే సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు నియామకాలు చేపట్టాం. ఎమ్మెల్యేల ఎంపిక, మంత్రివర్గ కూర్పులో ఎలాంటి నిశిత పరిశీలన చేశామో, అదే తరహాలో సమర్థులైన వారిని కలెక్టర్లుగా నియమించాం. మీరంతా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలి,” అని ఆయన ఆకాంక్షించారు.

పనితీరే కొలమానం.. విఫలమైతే చర్యలు తప్పవు

అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూనే, పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “పనితీరు చక్కగా ఉన్న అధికారులను నేను ఎప్పుడూ మార్చలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రిజర్వ్ బ్యాంక్ వంటి ఉన్నత సంస్థలకు వెళ్లారు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. ప్రభుత్వం అందించే ప్రతి సేవలోనూ ప్రజల సంతృప్తే మనకు కొలమానం కావాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి,” అని ఆయన హెచ్చరించారు. ఈ కలెక్టర్ల సదస్సు రాష్ట్ర పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande