ఈ విజయం బాధ్యత, సేవతో కూడిన ఉపాధ్యాయ వృత్తికి ఆరంభం: మంత్రి నారా లోకేశ్
అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ''ఎ
నారా లోకేశ్


అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, రికార్డు స్థాయిలో కేవలం 150 రోజుల్లోనే ఈ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశామని ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్‌పైనే తొలి సంతకం చేసిన విషయాన్ని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ, పారదర్శకంగా నియామక ప్రక్రియను ముగించినట్లు పేర్కొన్నారు. తుది జాబితా సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ www.apdsc.apcfss.in లో అభ్యర్థులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

ఎంపికైన అభ్యర్థులకు మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం బాధ్యత, సేవతో కూడిన ఉపాధ్యాయ వృత్తికి ఆరంభం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయాలని సీనియర్ ఉపాధ్యాయులను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande