ముంబయి,17, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు రాణిస్తున్నాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్న వార్తలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగబాకి 82,634 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 77 పాయింట్లు పుంజుకొని 25,316 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 23 పైసలు పెరిగి, 87.82 వద్ద ఉంది.
నిఫ్టీ సూచీలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఫెడ్ రేట్ల కోత వేళ అక్కడి మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా వాణిజ్య చర్చల కారణంగా మన సూచీలు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. .
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ