న్యూఢిల్లీ,17,సెప్టెంబర్ (హి.స.) బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.
ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఆర్‌జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ