అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.) ఒక చేత్తో జాతీయ జెండా, మరో చేత్తో ‘ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలి- ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి’ అనే నినాదం ఉన్న ప్లకార్డుతో విశాఖ నుంచి అమరావతికి ఆటోడ్రైవర్ చింతకాయల శ్రీను పాదయాత్ర చేశారు. విశాఖకు చెందిన ఆయన ఈ నెల 2న బయలుదేరి బుధవారం సాయంత్రానికి రాష్ట్ర సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించినా, తగిన విధంగా సాయం అందిస్తారన్న ఆశతో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. ‘ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించక ముందు రోజుకు రూ.1,200 వరకు సంపాదించేవాళ్లం. పిల్లల చదువులు, ఇంటి అద్దె, ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి అవి సరిపోయేవి. ఇప్పుడు రోజుకు 12 గంటలు కష్టపడినా రూ.500 రావడం కష్టమవుతోంది. మమ్మల్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రే ఆదుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ