హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)
వాతావరణ శాఖ అలర్ట్ కు భిన్నంగా బుధవారం రాత్రి మహానగరం హైదరాబాద్ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఎవరూ ఊహించిన విధంగా గంటల తరబడి కుండపోత వాన కురవడం తో నగరంలోని రోడ్లన్ని చెరువులను తలపించాయి. అలాగే లోతట్టు ప్రాంతాల వైపు వరద ముంచెత్తడంతో.. జలపాతాల మాదిరిగా నీరు ప్రవహించి.. వాహనాలు కొట్టుకొని పోయాయి. నిన్న రాత్రి 7 గంటల తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్ష ప్రారంభమై.. దాదాపు రాత్రి 11 గంటల వరకు ఏకదాటిగా దంచి కొట్టింది. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నిన్న కురిసిన భారీ వర్షంపై వాతావరణ శాఖ రిపోర్టు ఇచ్చింది.
ముషీరాబాద్ లో అత్యధికంగా 18.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అలాగే చిలకలగూడలో 14.7 సెం.మీ, మోండా మార్కెట్ లో 14.6 సెం.మీ, హెచ్ సీయూ పరిధిలో 14.4 సెం.మీ, బేగంపేటలో 13.5 సెం.మీ, లింగంపల్లిలో 13 సెం.మీ, ఖైరతాబాద్ లో 12.5 సెం.మీ, శ్రీనగర్ కాలనీలో 11.1సెం.మీ, షేక్ పేట్ లో 10.8 సెం.మీ, చందానగర్ లో 10.2 సెం.మీ, కాప్రాలో 9.4 సెం.మీ, బీహెచ్ఐఎల్ 8.8 సెం.మీ, కూకట్ పల్లిలో 9.5 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ రోజు కూడా నగరంలో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..