హైదరాబాద్, 18 సెప్టెంబర్ (హి.స.)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, కృష్ణానగర్, సనత్ నగర్, మియాపూర్, చందనాగర్, కేపీహెచ్బీ, సుచిత్ర, ఏఎర్రావు నగర్.. తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి రహదారులు అన్నీ జలమయమయ్యాయి. మోకాలి లోతు వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్ధృతంగా ప్రవహిహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృతి చెందాడు.
బల్కంపేట్లోని అండర్పాస్ బ్రిడ్జి కింద వరద నీటిలో కొట్టుకుపోయి ముషీరాబాద్కు చెందిన యువకుడు మొహమ్మద్ షరఫుద్దీన్ (27) మృతి చెందాడు. షరఫుద్దీన్ విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయానికి బల్కంపేట్ చేరుకున్నాడు. బల్కంపేట్ అండర్పాస్ బ్రిడ్జి వైపు నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలోకి బైక్పై వచ్చాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయాడు. స్థానిక యువకులు షరీఫుద్దీన్ను కాపాడే ప్రయత్నం చేశారు. ఐటీ అప్పటికే అతడు నీటి మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం షరీఫ్ డెడ్బాడీ గాంధీ మార్చురీకి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు