అమరావతి, 18 సెప్టెంబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. రైతు సమస్యలపై తక్షణమే చర్చ జరపాలని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, నినాదాలతో సభ దద్దరిల్లడంతో ఛైర్మన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
గురువారం ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే ఛైర్మన్ మోషేన్ రాజు ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర, యూరియా కొరత వంటి అంశాలపై చర్చించాలని కోరుతూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ తీర్మానాన్ని ఛైర్మన్ సున్నితంగా తిరస్కరించారు.
ఛైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రైతు సమస్యలపై ఎప్పుడైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలోనే రైతులకు తీవ్ర నష్టం జరిగిందని టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
సభను శాంతపరిచేందుకు ప్రయత్నించిన ఛైర్మన్ మోషేన్ రాజు, ఈ అంశంపై చర్చించేందుకు బీఏసీ (వ్యాపార సలహా కమిటీ)లో సమయం కోరాలని వైసీపీ సభ్యులకు సూచించారు. అయినప్పటికీ, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టి నిరసనను కొనసాగించారు. దీంతో సభలో పరిస్థితి అదుపు తప్పడంతో ఛైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి