న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.) భారత్ లోకి అక్రమంగా చొరబడే వారిపై ఉక్కుపాదం మోపనుంది సర్కార్. భారత్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను, ఇమ్మిగ్రేషన్ విషయాలను నియంత్రించడానికి రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందింది. ఏప్రిల్ 4, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, “కేంద్ర ప్రభుత్వం, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 (2025 చట్టం 13)లోని సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా ఇవ్వబడిన అధికారాలను ఉపయోగించి, సెప్టెంబర్ 1, 2025ని దీని ప్రారంభ తేదీగా ప్రకటిస్తోందని పేర్కొన్నారు.
ఈ చట్టం ప్రకారం, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా వీసాలను ఉపయోగించి భారతదేశంలోకి ప్రవేశించడం, ఉండటం లేదా మోసం చేసి వెళ్లడం.. చేసే వారికి ఇప్పుడు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, గరిష్టంగా రూ. 10 లక్షల జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు. కనీస శిక్ష 2 సంవత్సరాలు, కనీస జరిమానా రూ. 1 లక్షగా నిర్ణయించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ