న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.)
చైనాలో రెండు రోజుల పాటు షాంఘై సహకార సదస్సు జరిగింది. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీ.. ఇలా ఆయా దేశాధినేతలంతా హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక విమానాల్లో చైనాలో అడుగుపెట్టారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం తాజాగా వెరైటీగా అడుగుపెట్టారు. బీజింగ్లో జరిగే సైనిక కవాతులో పాల్గొనేందుకు బుల్లెట్ ప్రూఫ్ రైల్లో వచ్చారు. విదేశీ పర్యటనలు అంటే చాలా హడావుడి.. హంగామా ఉంటుంది. అందుకు భిన్నంగా కిమ్ జోంగ్ ఉన్ మాత్రం రైల్లో చైనాకు వచ్చారు. మంగళవారం బీజింగ్ లో జరిగే సైనిక కవాతులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కలిసి పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సందర్భంగా 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీజింగ్లో సైనిక కవాతు జరుగుతోంది. ఈ కవాతును జిన్పింగ్, కిమ్ కలిసి వీక్షించనున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ జోంగ్ ఉన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో కూడా సహకరించారు. ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యాకు పంపించారు. ఇక పుతిన్ కూడా నిన్న చైనాలో పర్యటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు