కడప, 2 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. మంగళవారం కమలాపురం నియోజకవర్గంలోని బుగ్గలేటిపల్లి క్యాంపు కార్యాలయంలో 69వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ప్రజాదర్బార్‌లో పలు కీలక సమస్యలు మంత్రి దృష్టికి వచ్చాయి. కమలాపురం నియోజకవర్గం, సీకే దిన్నె మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు తమను ఆదుకోవాలని మంత్రిని కోరాయి. బుగ్గమక ప్రాజెక్టు వద్ద తాము చదును చేసుకున్న 60 ఎకరాల పోడు భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని విన్నవించుకున్నాయి. అలాగే కడప-పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మించాలన్న తమ చిరకాల కోరికను నెరవేర్చాలని ఎస్. మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కొన్ని వ్యక్తిగత, సామాజిక సమస్యలను కూడా ప్రజలు మంత్రి ముందుంచారు. 2008లో ఏపీఐఐసీ సేకరించిన తమ భూమికి ఇంతవరకు నష్టపరిహారం అందలేదని కొప్పర్తి గ్రామానికి చెందిన చమిడిరెడ్డి జనార్దన్ రెడ్డి వాపోయారు. కడప నగరంలోని రజక కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అక్కాయపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి