హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి గండ్ర వెంకట రమణారెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలంలో ఇసుక దోపిడీపై మేము ధర్నా చేశాం. అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? కొందరు కాంగ్రెస్ నేతలు దొంగే దొంగ అన్నట్టు ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తుంటే పోటీ ధర్నాలు చేస్తున్నారు. మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. భూపాలపల్లి నియోజకవర్గమే కాదు.. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మా ప్రాంతం ఎడారిగా మారడం ఖాయం. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలి అని గండ్ర వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..