తెలంగాణ, ఖమ్మం. 20 సెప్టెంబర్ (హి.స.)
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం ఖమ్మం రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. రఘునాథపాలెం మండలం రేగులచర్ల గ్రామానికి చెందిన జంగా వెంకన్న, అదే గ్రామానికి చెందిన వెల్లబోయిన లక్ష్మణరావు, కొత్తగూడెం జిల్లా ఎదురుగడ్డ ప్రాంతానికి చెందిన పల్లపు సంపత్తులు ఓ ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. సిసిఎస్ సివిల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
వారిని విచారించగా ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, గొల్లగూడెం, మద్దులపల్లి గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడి బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా నేలకొండపల్లి, కానాపురం, రఘునాధపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 190 గ్రాముల బంగారం సుమారు 20 లక్షల విలువ గల ఆభరణాలను రికవరీ చేసినట్లు చెప్పారు. వారిని జిల్లా కోర్టులో హాజరు పరచడం జరిగిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు