హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
ఓ ఇంట్లో చొరబడి రూ.18 లక్షల
విలువ చేసే బంగారం చోరీ చేసిన ముగ్గురు నిందితులను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో వీరేంద్ర సింగ్ ప్రతాప్ ఇంట్లో ఇటీవల ముగ్గురు దుండగులు చొరబడి రూ.18 లక్షల విలువైన బంగారు నెక్లెస్, గొలుసులు, ఇతర నగలు, వెండి, సెల్ఫోన్లు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ బాలరాజు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం మీడియా ఎదుట హాజరుపరిచారు. వీరి దగ్గర నుండి ఒక పల్సర్ బైక్, ఆర్ఎక్స్ 100 బైక్, గ్లామర్ బైక్, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు