హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అప్రమత్తమైన స్థానికులు రైల్వే సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..