దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. ప్రజారోగ్య రంగంలో ఈ పథకం ఒక విప్లవం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి ఆయుష్మాన్ భారత్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య చికిత్సలను చౌకగా అందించడమే లక్ష్యమని వివరించారు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతోందని, ఎంతో వెసులుబాటు లభిస్తోందని అన్నారు.
దేశ పౌరులు గౌరవప్రదమైన జీవితం కొనసాగించడానికి ఆయుష్మాన్ భారత్ తోడ్పడుతున్నట్లు హర్షం వ్యక్తంచేశారు. నిధుల వ్యయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో మానవాభివృద్ధిలో మనం సాధిస్తున్న ప్రగతికి ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా 55 కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 42 కోట్లకుపైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేశామని పేర్కొన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా మారిందని స్పష్టంచేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ