దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.)ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్, చైనాలపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనా నిధులు ఇస్తున్నాయని మండిపడ్డారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తున్నాని అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా పేరు చెడిపోయిందని ట్రంప్ అన్నారు. ప్రపంచ దేశాలు ఆ దేశం యుద్ధం కొనసాగించడానికి వనరుల్ని ఇవ్వకూడదని చెప్పారు. సుంకాలకు అమెరికా సిద్ధంగా ఉందని, కానీ యూరప్ ,నాటో మిత్రదేశాలు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపేయడంలో విఫలయమ్యాయని విమర్శించారు. యూరప్ బలమైన చర్యలు తీసుకోకపోతే, అమెరికా ఒంటరిగా వ్యవహిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించడంలో రష్యా ఒక ఒప్పందానికి రాకపోతే, అమెరికా బలమైన, శక్తివంతమైన సుంకాలను విధించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ